అవతార పురుషుల తోడ్పాటు
ఇది ఎలా సాధ్యమవుతున్నది? పరంపర ద్వారా.అవతార పురుషులు తమ సందేశాలను మానవజాతి అంతటికి వ్యాప్తి చేయ సమర్ధులైన శిష్యులను తయారుచేసి, వదలి వెళుతున్నారు.వారి సందేశాల ప్రభావం, స్ఫూర్తి ఈశిష్యులద్వారా విద్య ,కళ ,విజ్ఞానం, మతం, ఆధ్యాత్మికత అనబడే సకల రంగాలకూ వ్యాప్తి గాంచుతుంది.వారి సందేశం ఒక నూతన శాస్త్రంగా రూపుదిద్దుకొంటుంది.అప్పటివరకు ఉంటూ వస్తున్న ఏ శాస్త్రాన్నిగాని అది నిందించటమో, విమర్శించటమో , తిరస్కరించటమో చేయదు; అందుకు మారుగా ఆ శాస్త్రం మునుపటి శాస్త్రాల అన్నింటి సంకలనంగా, పరిపూర్ణ రూపంగా పరిణమిస్తుంది. ఈ విధంగ వారి సాటిలేని జీవితం ద్వారానూ,వారు వదలి వెళ్ళే సందేశాల ద్వారానూ మానవజాతికి ఒక నూతన మార్గం,కాలానుగుణమైన ఒక వెలుగుబాట ఆవిష్కృతమౌతుంది.
భగవాన్ శ్రీరామకృష్ణులు
ఈ అవతార పురుషుల మార్గంలో మనకు అతి సమీపకాలంలో అవతరించినవారు భగవాన్ శ్రీరమకృష్ణులు. శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులు ప్రతి ఒక్కరూ ఆయన సందేశాలలో ఒక అంశాన్ని స్వీకరించి, దానిని తమ జీవితం ద్వారానూ,రచనలూ ప్రసంగాలు వివిధ మార్గాల వారానూ ప్రపంచానికి చాటారు.
ఆ శిష్యులలో ఒకరు మహేంద్రనాధ గుప్త(‘మ‘). శ్రీ రామకృష్ణుల అమృతవాక్కులను ప్రపంచానికి అందజేసే మహద్భాగ్యం పొందిన వారు ఈయన.తద్వారా ప్రపంచ మత చరిత్రలో తరగని కీర్తినార్జించారు.
శ్రీ రామకృష్ణుల అమృతవాక్కులు
1882వ సం|| ఫిబ్రవరిలో "మ" శ్రీ రామకృష్ణులను ప్రప్రధమంగా సందర్శించారు. ఆనాటినుండి శ్రీ రామకృష్ణుల మహాసమాధి(1886)వరకు దాదాపు 250 రోజులు ఆయన్ను దర్శించి, వారి అమృతవాక్కులను ఆలకించే భాగ్యం పొందినవారాయన.ఆయన ఉపదేశాలను తమ డైరీలో రాసుకొని, పదిలపరిచారు. ఆ తరవాత వాటిని శ్రీ శ్రీ రామకృష్ణ కథామృత పేరిట ఐదు సంపుటాలుగా వంగ భాషలో ప్రచురించారు. దీని తెలుగు అనువాదమే శ్రీ రామకృష్ణ కథామృతము.
(గ్రంధ వైశిష్ట్యం తరువాత పోష్టులో)
Thursday, 10 June 2010
Thursday, 3 June 2010
శ్రీ రామకృష్ణ కథామృతము
తొలి పలుకులు
మహాత్ములు
మహాత్ములలొ రెండురకాలవారు ఉన్నారు.ఒక రకం వారు సామాన్యుల్లా జన్మించి ఆధ్యాత్మిక విజయాలు సాధించి పరిపూర్ణ స్థితిని పొందేవారు.వీరు సాధారణ గురువులు, ఆచార్యులు. మరొక కోవకు చెందిన మహాత్ములుపరిపూర్ణులుగానే జన్మిస్తారు. సొంతలాభం, స్వార్ధప్రయోజనాల కోసం కాకుండా ఇతరులకు సోదాహరణగా ఉండాలని మాత్రమే వీరు ఆధ్యాతిక సాధనానుష్టానాలు చేపడతారు. వీరు అవతార పురుషులు.
మహాత్ముల సేవ
రెండు రకాల ధర్మాలు ఉన్నవి. ౧. విశిష్ట ధర్మం. ౨. సామాన్య ధర్మం. విశిష్ట ధర్మం అన్నది బాహ్యజీవితానికి సంబంధించినది.సమాజంలొ ఒకరి స్థానానికి తగ్గట్టు వారు చేయవలసినవి,చేయకూడనివి మొదలైన వాటిని నిర్ణయించేది ఇది. సామాన్య ధర్మం అంతరంగానికి సంబంధించినది. ఒకరు తమకు తామే చేసుకొని, తమను దైవీస్థితికి పెంచుకోవటానికి తగ్గ మార్గాలను, పద్ధతులను చూపేది ఇది.
విసిష్ట ధర్మం నశించే సందర్భంలో మొదటీ కోవకు చెందిన మహనీయులు జన్మిస్థారు. భగ్నమైన ఆ నిర్ణీత ధర్మాన్ని పునరుద్ధరించడానికి మార్గం చూపుతారు. తరువాత నిష్క్రమిస్తారు. ఒక నిర్ణీత కాలానికి ఒక నిర్దిష్టస్థలంలొ నిర్ణీత కార్యం ఒక దానిని నిర్వర్తించటానికి రావటం వలన వీరి ప్రభావం ఒక నిర్ణీతపరిధి లోపలే ఇమిడిపోతుంది. కాలగతిలో మానవాళి వీరిని మరచి పోవడము కద్దు.
అయితే సామాన్యధర్మం నశించే వేళ _ మనిషి మనిషిగా జీవించడాన్నే మరచిపోవడానికి యత్నించేటప్పుడు, దివ్య జీవితాన్ని త్యజించటానికి తెగించేటప్పుడు రెండవ కోవ మహాత్ములు అవతరిస్తారు. వీరు యావత్ మానవజాతికి సంబంధించిన ఒక సందేశంతో వస్తారు.వీరి జీవితము సందేశము దేశకాలాలకు అతీతమైనైగా ఒప్పరుతుంది. వీరి జీవితకాలంలో కొద్దిమంది మాత్రమే వీరిని గుర్తిస్తారు. అయితే వీరి నిర్యాణానంతరం వీరి సిద్దాంతాలూ,బొధించిన సత్యాలూ విశ్వరూపం సంతరించుకోని ప్రపంచాన్ని చుట్టి వేస్థాయి. కాలం గడిచేకొద్దీ అవి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కోటానుకోట్ల జన జీవితాలకు ఆదర్శనీయంగా భాసిల్లుతాయి.
Subscribe to:
Posts (Atom)


